కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్

‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. జులై 07 నుండి 13 వరకు ఏడు రోజుల పాటు ఘనంగా జరపాలని సన్నాహాలు చేసింది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా కార్యక్రమాలు తాత్కాలిక బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాకతీయ ఉత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, వర్షాలు తగ్గిన అనంతరం తిరిగి కొనసాగించనున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కాకతీయ ఉత్సవాలు ప్రారంభించిన తొలినాడు, కాకతీయ వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్ రాకతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనా, ఆ తర్వాతి రోజు నుండి వర్షాల కారణంగా ఉత్సవాలలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా ప్రభుత్వం ఆశించిన మేర ఘనంగా ఉత్సవాల నిర్వహణ సాధ్యం కావడం లేదు. కాకతీయుల కళా వారసత్వాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా ఖిల్లా వరంగల్ లోని ఖుష్ మహల్ లో వివిధ కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

తెలంగాణను పరిపాలించిన రాజులలో కాకతీయ రాజులది విశిష్టమైన స్థానం. కాకతీయుల కాలంలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందింది. నేటికీ కాకతీయుల కళా సంపద తెలంగాణ రాష్ట్రానికి మకుటాయమానంగా నిలుస్తుంది. అలాంటి కాకతీయుల వైభవాన్ని నేటి తరానికి చాటాలని ఉద్దేశంతో టిఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ వారోత్సవాలను నిర్వహించ తలపెట్టి, ఆ వారోత్సవాల కు ముఖ్యఅతిథిగా కాకతీయ వంశానికి చెందిన కమల చంద్ర భాంజ్ దేవ్ ను ఆహ్వానించింది.

తమ పూర్వీకులు పాలించిన గడ్డపై కాలు పెట్టిన కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్ కు రాష్ట్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. భద్రకాళి ఆలయం స్వాగత ద్వారం వద్ద మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.