పయ్యావుల కేశవ్ గన్ మెన్లను తొలగించలేదు – అనంతపురం పోలీస్ శాఖ

టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించిందనే వార్తలను ఖండించారు అనంతపురం పోలీసులు. పయ్యావుల కేశవ్ భద్రతలో భాగంగా1+1 గన్మెన్లను కొనసాగిస్తున్నామని.. గన్ మెన్లను తొలగించాలనే ఆదేశాలు మాకు రాలేదని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం తెలిపింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చాకే పయ్యావుల కేశవ్ గన్ మెన్ల భద్రతను తొలగించారని.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.

గత పదేళ్లుగా పయ్యావుల కేశవ్ గన్ మెన్లుగా కొనసాగుతున్న రమేష్, రామాంజనేయులు పనిచేస్తున్నారు. వీరి స్థానంలో కొత్త పీఎస్ఓల నియామకం జరిగిందని.. తాను చెప్పిన వారే గన్ మెన్లుగా ఉండాలని పయ్యావుల పట్టుబట్టినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు కొత్త గన్ మెన్లకు అధికారులు డ్యూటీ వేశారు. అందుకే గన్ మెన్లు తీసేశారంటూ పయ్యావుల కేశవ్ ప్రచారం చేస్తున్నారంటున్నారు. ఈ ప్రచారాన్ని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప కొట్టిపారేశారు. పయ్యావుల కేశవ్ కు 1 ప్లస్ 1 భద్రత కొనసాగుతోందని.. ఆయన భద్రత ఉపసంహరించాలన్న ఆలోచన లేదని.. తప్పుడు ప్రచారం నమ్మొద్దంటున్నారు.