మా మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ మంత్రి కాకాణి, అనిల్ లు క్లారిటీ

గత కొద్దీ రోజులుగా నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, ప్ర‌స్తుత మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మధ్య గ్రూప్ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా పరోక్షంగా కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి జిల్లాకు వ‌స్తే.. కాకాణి – అనిల్ కుమార్ యాదవ్ పోటా పోటీగా బ‌హిరంగ స‌భ‌లు నిర్వహించి పలు కామెంట్స్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ రోజు అనిల్ కుమార్ యాద‌వ్, మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి తో జ‌గ‌న్ స‌మావేశం అయ్యారు. జగన్‌ భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తో ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని ప్ర‌క‌టించారు. లేని విభేదాల‌ను ఉన్న‌ట్టు మీడియా సృష్టిస్తోంద‌ని అస‌హనం వ్య‌క్తం చేశారు.

సీఎంను కలవడంలో పెద్ద విశేషం లేదన్న కాకాణి.. అభివృద్ధి, సంక్షేమం, జిల్లా పనులకు సంబంధించే విషయాలపైనే చర్చించడం జరిగిందని చెప్పారు. కొత్త జిల్లాల ఇంఛార్జిల నియామకం నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందన్నారు. ‘మా జిల్లా అభివృద్ధి విషయాలపై సీఎంతో చర్చించాం. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్‌ చెప్పారు. మా మధ్య విభేదాలు ఉంటే కదా చర్చించడానికి!..

అనిల్‌తో విభేదాలన్నది మీడియా సృష్టే…పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడూ అనిల్, నేను కలిసే పనిచేశాం. అనిల్ నాకు సోదరుడి లాంటి వాడు. కావాలనే మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేశారు’’ అని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. అలాగే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చాం. మేమంతా సీఎం జగన్ సైనికులం.. ఆయన ఏది చెబితే అది చేస్తాం. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డికి, నాకూ మధ్య ఏమీ లేదు. మా ఇద్దరి మధ్య సమస్యలు ఉన్నాయని నేను చెప్పలేదు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం తప్ప మా పార్టీలో వర్గాలు అంటూ ఉండవు అని చెప్పుకొచ్చాడు.