కేంద్రానికి కేటీఆర్ సవాల్..

తెలంగాణ vs కేంద్రం వార్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర సర్కార్ చిన్న చూపు చూడడం ఫై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా మాటల యుద్ధం చేస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్ర సర్కార్ కు సవాల్ విసిరారు. కేంద్రానికి తెలంగాణ నుంచే ఎక్కువ నిధులు వెళుతున్నాయ‌ని చెప్పిన కేటీఆర్‌… కేంద్రం నుంచి తెలంగాణ‌కు చాలా త‌క్కువ మోతాదులోనే నిధులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. తాను చెప్పేది త‌ప్పైతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా రూ.3, 65,797 కోట్లు కేంద్రానికి ఇస్తే… అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి తెలంగాణ‌కు వ‌చ్చింది కేవ‌లం రూ.1,68,647 కోట్లేన‌ని కేటీఆర్ అన్నారు. ఈ మాట త‌ప్పైతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పిన కేటీఆర్‌…త‌న మాట‌ను త‌ప్పుగా నిరూపిస్తే ఎడ‌మ కాలికి ఉన్న చెప్పులా మంత్రి ప‌ద‌విని వ‌దిలేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాక సాధార‌ణ ఎమ్మెల్యేగానే తాను కొన‌సాగుతాన‌ని కేటీఆర్ అన్నారు. ద‌మ్ముంటే బీజేపీ నేత‌లు త‌న వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని నిరూపించాల‌ని ఆయ‌న బీజేపీకి స‌వాల్ విసిరారు.

‘గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి దేశంలో నిరుద్యోగం పెరిగింది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు ఎల్పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అతిఎక్కువ ధరకు చేరుకుంది. వినియోగదారుల నమ్మకం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు చెప్తోంది. దీనిని ఎన్‌డీఏ ప్రభుత్వం అనాలా లేక ఎన్‌పీఏ ప్రభుత్వం అనాలా? భక్తులారా.. ఎన్‌పీఏ అంటే నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్స్‌ (నిరర్ధక ఆస్తులు) అని అర్థం’అంటూ ఎద్దేవా చేశారు.