కేరళలో నిఫా వైరస్ విజృంభన..7 గ్రామాలు కంటైన్‌మెంట్‌ జోన్‌గా గుర్తింపు.. స్కూల్స్‌, ఆఫీసులు బంద్‌

Kerala Nipah deaths: 7 villages declared containment zones, schools closed

తిరువనంతపురంః కేరళ లో నిఫా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఫా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కోజికోడ్‌ జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాలో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరణించిన వారితో సన్నిహితంగా ఉన్న వారితో పాటు మొత్తం 130 మంది రక్త నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపింది. కోజికోడ్‌లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసింది.

మరోవైపు జిల్లాలోని ఏడు గ్రామ పంచాయితీలు తిరువళ్లూర్‌, కుట్టియేడి, కయక్కోడి, విల్లయపల్లి, కవిలుంపర, అయన్‌చేరి, మరుతోంకరలను కంటైన్‌మెంట్‌ జోన్‌ లుగా ప్రకటించింది. ఆ గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, కార్యాలయాలను అధికారులు మూసివేశారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అదేవిధంగా నిఫా వైరస్‌ హెచ్చరికల నేపథ్యంలో పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) బృందాలు కేరళకు చేరుకున్నాయి. కోజికోడ్ మెడికల్ కాలేజీలో మొబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి నిఫా పరీక్షలను చేపడుతున్నారు.

కాగా, దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్‌ కేసు మే 19, 2018లో కోజికోడ్‌ జిల్లాలోనే బయటపడింది. ఈ వైరస్‌ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్‌ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్‌ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.