మల్లారెడ్డి కాన్వాయ్ మీద జరిగిన దాడిని ఖండించిన కేఏ పాల్

ఘట్‌కేసర్‌ లో ఆదివారం రెడ్డి సింహగర్జన మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ఫై జరిగిన దాడిని ఖండించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని, రెడ్డి సామాజిక వర్గ గొడవ, దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు అని అన్నారు. మతాలను, కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయన్నారు. అలాగే బెంగళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ పై దాడిని కూడా ఖండిస్తున్నట్లు పాల్ చెప్పారు. గతంలో రాజకీయాల్లో ఉన్నవారు వారి పేరు పక్కన ఉన్న తొక్కను తీసేసి ప్రజలకు సేవ చేశారని కేఏ పాల్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చివరన రెడ్డిని తీసేశారని పాల్ గుర్తు చేశారు.

మీడియా.. ప్రజలకు చూపించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని హితబోధ చేశారు. చైనా 70 దేశాలకు అప్పు ఇచ్చిందని పాల్ తెలిపారు. చైనా ఇచ్చిన అప్పులు తిరిగి ఇచ్చేందుకు కొన్ని దేశాలు ముందుకు రావడం లేదన్నారు. అప్పు తీసుకున్న దేశాలు చైనాకు తిరిగి డబ్బు ఇవ్వకపోతే చైనా నాశనం అయిపోతుందన్నారు. దేశంలో ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని పాల్ ధ్వజమెత్తారు. మూడు నెలల్లో సంచలనం సృష్టిస్తామని కామెంట్ చేశారు. మరోపక్క మంత్రి మ‌ల్లారెడ్డిపై దాడికి ప్ర‌య‌త్నించిన‌వారిపై ఘ‌ట్‌కేస‌ర్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌ల్లారెడ్డిపై దాడికి య‌త్నించిన‌వారిని గుర్తించి, కేసు న‌మోదు చేయాల‌ని టీఆర్ఎస్ నాయ‌కులు ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో సోమ‌వారం ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా సోమ‌శేఖ‌ర్‌రెడ్డి, హ‌రివ‌ర్ధ‌న్‌రెడ్డిల‌ను ప్ర‌ధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరిపై 341, 352, 504, 506, 147, 144 ఐపీసీ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. వీరంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫాలోవ‌ర్స్‌గా భావిస్తున్నారు.