ఢిల్లీలో గాలి,వాన బీభత్సం..

దేశ రాజధాని ఢిల్లీ లో సోమవారం సాయంత్రం గాలి,వాన బీభత్సం సృష్టించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ గాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షం, గాలితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండే ఎండలతో విసిగిపోయిన జనం వానలు కురవడంతో కాస్త ఉపశమనం పొందారు.

వాతావరణం అనుకూలించకపోవటంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయవిమానాశ్రయంలో పలు విమానాల ల్యాండింగ్ కష్టమయ్యింది. అధికారుల నుంచి క్లియరెన్స్ రాకపోయే సరికి కొద్ది సేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. నగరంలో పార్కింగ్ చేసిన వాహనాలపై చెట్లు విరిగి పడ్డాయి. గాలుల వేగానికి నగరంలోని పలు కార్యాలయాల అద్దాలు పగిలిపోయాయి.

ఏపీ, తెలంగాణ భవన్ లలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. భవనంలోని అద్దాలు పగిలిపోయాయి. దెబ్బతిన్న ప్రదేశాలను ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. ఢిల్లీలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పరిస్ధితి చూడలేదని వారు చెప్పారు. దెబ్బతిన్న భవనాలకు త్వరలోనే మరమ్మత్తులు చేయిస్తామని… పాత భవనాలను ఖాళీ చేయిస్తామని వారు తెలిపారు.