కేసీఆర్ ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ – జూపల్లి

తెలంగాణ లో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ బిఆర్ఎస్ ముందుగానే తమ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైంది. కేసీఆర్ గజ్వేల్ , కామారెడ్డి రెండు స్థానాల నుండి బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టం చేయడం పట్ల బిజెపి , కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు , ఆరోపణలు చేస్తున్నారు. రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని ముందే అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

గత ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయని కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌రెడ్డి తమ దెబ్బ ఎలా ఉంటుందో కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా చూపించాలని అన్నారు. టికెట్ల కోసం తాము కొట్టుకోవడం పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం పెరిగిపోయాయని, తెలంగాణ అమరవీరుల రక్తపు కూడును కేసీఆర్ కుటుంబం తింటోందని జూపల్లి ఆరోపించారు.