టీడీపీ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూత..

టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ తుదిశ్వాస విడిచారు. ఏడాది క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు ఇటీవలే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం పుష్పరాజ్ కన్నుమూశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ లో ఉన్న పుష్పరాజ్‌.. 1983, 1985లో తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్​లో మంత్రిగా పనిచేశారు.

1994లో వామపక్షాలతో పొత్తు కారణంగా టికెట్ రాలేదు. మళ్లీ 1999లో టీడీపీ తరఫున తాడికొండ నుంచే పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు. 2004లో టికెట్ వచ్చినా ఓటమి పాలయ్యారు. 2017లో ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇక పుష్పరాజ్ మృతిపట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. పుష్పరాజ్ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత, ఆత్మీయులు జేఆర్‌ పుష్ఫరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. నాకు అత్యంత ఆప్తులైన నేతలలో ఆయన ఒకరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా దళిత, నిరుపేద ప్రజలకు పుష్పరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియడారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పుష్పరాజు ప్రతి సందర్భంలోనూ పార్టీకి నిజాయితీగా సేవలందించారు.ఆయన మృతి పార్టీకి తీరని లోటు.పుష్పరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ…వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.