“వ్యక్తిగతంగా మీరంటే ప్రాణం ఇస్తాం.. కానీ మీ వెంట రాలేం..” రాజగోపాల్ కు షాక్ ఇస్తున్న కార్యకర్తలు

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమి తేల్చుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీని విడి బిజెపి లో చేరాలని అనుకుంటున్నాడు. కానీ ఆయన నియోజకవర్గ ప్రజలు మాత్రం వ్యక్తిగతంగా మీరంటే ప్రాణం ఇస్తాం.. కానీ మీ వెంట రాలేం అంటూ తేల్చి చెపుతుండడం తో రాజగోపాల్ కు ఏంచేయాలో అర్ధం కావడం లేదు. మూడు రోజులుగా నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో రాజగోపాల్​ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వటంలేదు. పార్టీ మార్పుతో పాటు.. రాజీనామా అంశంపై కూడా స్థానిక నాయకులతో రాజగోపాల్​ రెడ్డి చర్చిస్తున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అయితే.. కార్యకర్తల నుంచి ఆయనకు మిశ్రమ స్పందన వస్తుంది.

మరోపక్క రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు నేతలు ఆరాటపడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరికపై బీజేపీలో చర్చ జరుగుతోంది. ఆయనను రేపు (శుక్రవారం) ఢిల్లీ తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అయితే రాజగోపాల్ మాత్రం పార్టీలో చేరేందుకు మరో వారం సమయం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకోవాలని బిజెపి పార్టీ యోచిస్తోంది. అయితే రాజగోపాల్ రాజీనామా పై ఎటూ తేల్చకుండా బీజేపీ నేతలను గందరగోళ పెడుతున్నట్లు తెలుస్తుంది. రాజీనామాపై ఆగస్ట్ 7 వరకు సమయం ఇవ్వాలని రాజగోపాల్ కోరినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.