తెలంగాణ బిజెపి నేతలతో సమావేశమైన జేపీ నడ్డా

కొందరు నేతలు నడ్డాను విడివిడిగా కలిసిన వైనం

JP nadda

హైదరాబాద్‌ః బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిలో కొందరు నడ్డాను విడివిడిగా కలుసుకున్నారు. మొత్తమ్మీద… పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధాన అంశం అని నడ్డా వారికి స్పష్టం చేశారు. ఇతర అంశాలు ఏవైనా సరే పక్కనపెట్టేయాలని, వచ్చే ఎన్నికల్లో బిజెపి ని గెలిపించడమే అందరి లక్ష్యం కావాలని కర్తవ్యబోధ చేశారు.

రాష్ట్రంలో బిజెపి అంతర్గత వ్యవహారాలు మునుపెన్నడూ లేనంతగా చర్చకు దారితీశాయని, దీన్ని జాతీయ నాయకత్వం సహించబోదని నడ్డా ఘాటుగా హెచ్చరించారు. పార్టీ జాతీయ స్థాయి పెద్దలు ఇకపై క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటిస్తుంటారని, రాష్ట్ర నేతలు కూడా క్రమశిక్షణతో మెలగాలని హితబోధ చేశారు. ఒకరిపై ఒకరు బురదచల్లే కార్యక్రమాలు కట్టిపెట్టాలని, పరస్పర ఆరోపణలు చేసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని నడ్డా స్పష్టం చేశారు.

శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, తెలంగాణ బిజెపి ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ తదితరులు హాజరయ్యారు.