ఆ నలుగురు చంద్రబాబుకు అమ్ముడుపోయారు – మంత్రి జోగి ర‌మేష్

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు..టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ కు ఓట్లు వేయడం తో ఆమె విజయం సాధించారు. ఈ విజయం తో టీడీపీ సంబరాలు చేసుకుంటుంటే..వైస్సార్సీపీ మాత్రం ఓటు వేసిన వారిపై మాత్రం ఆగ్రహం తో ఊగిపోతున్నారు. ఇప్పటికే పలువురు వైస్సార్సీపీ నేతలు దీనిపై స్పందించగా..తాజాగా మంత్రి జోగి ర‌మేష్ పలు విమర్శలు చేసారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌ర‌ని గ్ర‌హించి చంద్ర‌బాబుకు అమ్ముడ‌బోయార‌ని మంత్రి జోగి ర‌మేష్ విమ‌ర్శించారు.

నిన్న జ‌రిగిన ఎన్నిక‌లో కూడా ప్ర‌లోభాలు, మేనేజ్ చేయ‌డం చూశాం. ఇంత‌కు ముందు వైస్సార్సీపీ త‌ర‌ఫున 23 మంది ఎమ్మెల్యేల‌ను దొడ్డిదారిన అమ్ముడ‌పోయినా, తొణ‌క‌ని, బెణ‌క‌ని జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో మ‌ళ్లీ 151 స్థానాల్లో గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు కొనుగోలు చేస్తారు..అమ్ముడ‌పోతారు. ఏ పార్టీ గుర్తు లేకుండా, సింబ‌ల్ లేకుండాగెలిచి సంక‌లు గుద్దుకుంటున్నారు. జ‌గ‌న్ నాయ‌కత్వంలో 2024లో వైస్సార్సీపీ విజ‌య‌దుందుబి మోగించ‌బోతోంది. మ‌ళ్లీ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. రాసి పెట్టుకోండి. చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేశారో చూశాం. తెలంగాణ‌లో ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల‌ను ఏ విధంగా ప్ర‌లోభ‌పెడుతారో అంద‌రం చూశాం. జ‌గ‌న్ త‌మ‌కు సీటు ఇవ్వ‌రు అనుకున్న ఎమ్మెల్యేలే చంద్ర‌బాబుకు అమ్ముడ‌బోయారు. ఈ రోజు సంబ‌రాలు చేసుకుంటున్నారు..కేరింత‌లు కొడుతున్నారు. కానీ వైస్సార్సీపీ కంచుకోట‌ను ఇంచుకూడా క‌దిలించ‌లేదు. చంద్ర‌బాబు కాదు..ఆయ‌న అబ్బ వ‌చ్చినా కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి కాకుండా ఆప‌లేర‌ని మంత్రి జోగి ర‌మేష్ అన్నారు.