చంద్రబాబు కు ఇవే ఆఖరి సంబరాలు -కాకాణి

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. దీని బట్టి చూస్తే అధికార పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ క్రమంలో టీడీపీకి ఓటు వేసిన వారిపై వైస్సార్సీపీ అధిష్టానం సీరియస్ గా ఉందని , ఆ నలుగురు ఎవరో ఇప్పటికే అధిష్టానానికి తెలిసిందని మంత్రి కాకాణి అన్నారు.

వైస్సార్సీపీ కి వ్యతిరేక ఓటు వేయడం పార్టీ అంతర్గత సమస్య అని.. అలాంటి వారిపై చర్యలుంటాయని తెలిపారు. అలాగే చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవేనని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విషయం బయటపడుతుందని చెప్పారు. 2024లో జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ క్రాస్ ఓటింగ్ ఫై మంత్రి రోజా స్పందించారు.

జగన్ ను ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టమ‌ని, ఆయ‌న‌కు కాద‌ని రోజా అన్నారు. జగన్ చరిష్మాతో మేమంతా ఎమ్మెల్యేలుగా గెలిచామ‌న్నారు. చంద్రబాబు వైస్రాయ్ రాజకీయాలను ఇప్పటికీ సిగ్గులేకుండా కొనసాగిస్తున్నారు. ఇలాంటి రాజ‌కీయాలు చేసే చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నపుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఎమ్మెల్యేలను కొన్న వ్యక్తి చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా రావు. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తెలుస్తుంది. ఎమ్మెల్యే సీట్లు రాని వారు వెళ్ళారు, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తప్పవని రోజా అన్నారు.