ఈ నెల 26 నుంచి టీ కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు నేతలంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ప్రారభించబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రలో భాగంగానే, ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందని రేవంత్ చెప్పుకొచ్చారు. భద్రాచలం నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని రేవంత్ ప్రకటించారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.

ఇక, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేతో సమావేశానికి మూడు పర్యాయాలు హాజరుకాని నేతల నుంచి వివరణ తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటె శనివారం గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పటు చేసారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సమక్షం జరిగిన ఈ సమావేశంలో సురేఖ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయకపోవడం వల్లే ఓడిపోయామని, ఇప్పటికైనా కాంగ్రెస్ లో అందరు కలిసి పని చేయాలని సూచించారు.

అంతేకాకుండా పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వ్యక్తిగత అంశాలు మాట్లాడవద్దని కోరారు. ఏదైనా ఉంటే ఇన్చార్జిని కలవాలని సూచించారు.

గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అవుతున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.