హైదరాబాద్‌ చేరుకున్న జార్ఖండ్‌ జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Jharkhand JMM and Congress MLAs reached Hyderabad

హైదరాబాద్‌ః జార్ఖండ్‌ అసెంబ్లీలో బలనిరూపణ కోసం అధికార కూటమికి ఆ రాష్ట్ర గవర్నర్‌ పది రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా బలం నిరూపించుకోవాల్సి ఉండటంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక విమానంలో జార్ఖండ్‌ రాజధాని రాంచి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక బస్సుల్లో రెండు వేర్వేరు హోటల్స్‌కు తరలించారు. కాగా, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయ్యారు. ఈడీ రెండు రోజుల క్రితం ఆయనను అరెస్ట్‌ చేసింది.

దాంతో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్‌ సోరెన్‌ జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పది రోజులలోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆయనను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన తన సంకీర్ణ సర్కారులోని జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. నగరంలోని రెండు వేర్వేరు హోటళ్లలో వారి బసకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.