ఆరు గ్యారెంటీల అమలుపై సిఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారుః కెటిఆర్‌

కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆగ్రహం

brs-ktr-comments-on-cm-revanth-reddy-over-promises

హైదరాబాద్‌ః నేడు ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని అన్నారు. తెలంగాణ హక్కులు సాధించాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి తీరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 అబద్దపు హామీలు ఇచ్చి గెలిచిందని ఆరోపించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని… కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్… ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు… గ్యారెంటీలు అమలు చేసేది లేదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. I.N.D.I.A. కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి చెక్ పెట్టాలని… కేంద్రంలో బిజెపిని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని వ్యాఖ్యానించారు.

రుణమాఫీ అమలు కాలేదు… ఆడబిడ్డలకు రూ.2500 ఇవ్వలేదు… రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేయడం లేదని కెటిఆర్ మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారన్నారు. ఆరున్నర లక్షలమంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు కాలిన ఓ ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందు ఆటో కాలబెట్టాడన్నారు. బిఆర్‌ఎస్‌ను పాతిపెడతానని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ లాంటి బుడ్డర్ ఖాన్‌లను కెసిఆర్‌ ఎంతోమందని చూశారన్నారు. ఎంతో మంది తీస్మార్ ఖాన్‎లను మాయం చేసి తెలంగాణ తెచ్చారన్నారు. కార్యకర్తకు అన్యాయం జరిగినా అందరం వస్తామని ధైర్యం చెప్పారు. మనకు బాస్‌లు ఢిల్లీలోనో… గుజరాత్‌లో లేరని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ లంకెబిందెల కోసం అధికారంలోకి వచ్చారని… కానీ సచివాలయంలో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయని వారు తెలుసుకోవాలని చురక అంటించారు. లంకెబిందెల కోసం వెతికేది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతామని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాలేదని ప్రజలు బాధపడుతున్నారన్నారు.