సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా..

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించగా.. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా చేసిన వెంక‌ట్రామిరెడ్డి బీఆర్కే భ‌వ‌న్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వామ్యం కావాల‌నుకున్నాను. కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను. కేసీఆర్ నుంచి పిలుపు వ‌చ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని వెంక‌ట్రామిరెడ్డి ప్ర‌క‌టించారు. తెలంగాణ రావ‌డం ఒక‌ అదృష్టం. వ‌చ్చిన తెలంగాణ‌ను సీఎం కేసీఆర్ అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తి, ఆలోచ‌న విజ‌న్ త‌న‌ను ఎంతో ప్ర‌భావితం చేశాయి. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం కృషి చేస్తోంద‌న్నారు. సుమారు ఏడేండ్లు సిద్దిపేట జిల్లాలో ప‌ని చేశాను అని వెంక‌ట్రామిరెడ్డి పేర్కొన్నారు.

గతంలో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్డీఓగా సేవలు అందిచారు. ఇటీవల వరిధాన్యాన్ని అమ్మవద్దని వ్యాపారులను హెచ్చరించడం, రైతులు ఎవ్వరూ వరి ధాన్యాన్ని సాగు చేయవద్దని హెచ్చరించడంతో పాటు… వ్యాపారులు సుప్రీం కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా వదలేది లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించి విమర్శలు చేశాయి. కలెక్టర్ టీఆర్ఎస్ తొత్తుగా మారారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. కలెక్టర్ వ్యాఖ్యలపై హై కోర్ట్ సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.