పేర్ని నాని అడ్డాలో జనసేన ఆవిర్భావ సభ

జనసేన ఆవిర్భావ సభ వేదిక ఫిక్స్ చేసారు అధినేత పవన్ కళ్యాణ్. నిత్యం తనపై విమర్శలు చేసే పేర్ని నాని అడ్డాలో జనసేన ఆవిర్భావ సభ పెట్టబోతున్నారు. జనసేన ఏర్పాటు చేసి.. ఈ ఏడాది పదేళ్లు నిండుతున్నాయి. 10 వ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14 వ తారీఖున ” మచిలీపట్నం ” లో నిర్వహించాలని నిర్ణయించడమే కాకుండా.. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో రోడ్ షో ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నంలో నిర్వహిస్తామని.. 34ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు‌ చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. భద్రత పరంగా తగిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేదికకు పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం చేశామని తెలిపారు. త్వరలోనే ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

గత ఏడాది ఆవిర్భావ సభను ఇప్పటంలో నిర్వహించారు. చివరి వరకూ ఆవిర్భావ సభ కోసం ఇబ్బందులు తప్పలేదు. చివరికి రైతులు ముందుకు వచ్చి పొలం ఇవ్వడంతో సభ నిర్వహించారు. అయితే ఈ సారి ముందుగానే మచిలీపట్నంలో స్థలం ఖరారు చేసుకుని అధికారిక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు అనే అంశం ఫై పవన్ ఆవిర్భావ వేదిక ఫై ప్రకటిస్తారని అంత భావిస్తున్నారు. కొంతకాలం క్రితం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ గౌరవానికి భంగం కలుగకుండా ఉంటేనే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని పరోక్షంగా టీడీపీతో పొత్తు గురించి వ్యాఖ్యానించారు. అయితే ఆ తరువాత ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఈసారి క్లారిటీ ఇస్తారని అంత భావిస్తున్నారు.