జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్

టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతకు నిరసనగా మనోహర్ ధర్నా

janasena-leader-nadendla-manohar-arrested

అమరావతిః జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, ఇతర జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్మా చేసింది. వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియలెస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా? అని ప్రశ్నించారు.

తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని… శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.