తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

Telangana Assembly Speaker Election Notification Released

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 14న ఉదయం 10.30 గంటలకు సభాపతి ఎన్నికను నిర్వహించనున్నారు. స్పీకర్‌ పదవికి పోటీపడే వారి నుంచి ఈ నెల 13న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈమేరకు అసెంబ్లీ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా, కొత్తగా శాసనసభ శనివారం కొలువుదీరిన విషయం తెలిసిందే. నూతన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను చేయాలని అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే ఒక్కరే నామినేషన్‌ రావాల్సి ఉంటుంది. ఇతర సభ్యులు ఎవరైనా పోటీలో ఉంటే బ్యాలెట్‌ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. స్పీకర్‌ ఎన్నిక ప్రొటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో జరుగనుంది.