కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనసేన

రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకొని జనసేన పార్టీ తన దూకుడు ను పెంచింది. అధినేత పవన్ కళ్యాణ్ సైతం పార్టీ పైనే పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. ఓ పక్క సినిమా షూటింగ్ లు చేస్తూనే..మరోపక్క పార్టీ కార్యక్రమాలను పరివేక్షిస్తున్నారు. తాజాగా జనసేన కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న పవన్, తాజాగా ప్రజాసమస్యలను స్వీకరించేందుకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ సామాన్యుడి గళం వినిపించేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేలా జనవాణి కార్యక్రమం ఉంటుందని.. జులై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం వేదికంగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ అర్జీలపై జనసేన కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుందని తెలిపారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది.. తొలి రెండు వారాలు మాత్రం విజయవాడలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజా సమస్యలు నేరుగా వింటూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో సామాన్యుడికి అర్జీలు ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. పవన్‌తో చెప్పుకుంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని బలపరిచే విధంగా ‘జన వాణి’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు.