ఆలయంలో అర్చకుడిపై దాడి..ఎవరి కళ్లలో ఆనందం కోసం చేశారు?: పవన్ కల్యాణ్

యథా నాయకుడు–తథా అనుచరుడు అనేలా వైఎస్‌ఆర్‌సిపి వాళ్లు తయారయ్యారని విమర్శ

jana-sena-chief-pawan-comments-on-the-attack-on-the-priest-in-someswara-temple

అమరావతిః భీమవరం పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై వైఎస్‌ఆర్‌సిపి నేత దాడి చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని నిలదీశారు. ఇది పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ప్రతీక అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయ బోర్డు చైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించాలని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ కోరారు. అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం రాక్షసత్వమేనని మండిపడ్డారు. పవిత్ర ఆలయ ప్రాంగణాల్లో అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు. యథా నాయకుడు–తథా అనుచరుడు అనేలా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు తయారయ్యారని విమర్శలు చేవారు. ఈశ్వరుని సన్నిధిలో అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.