మునుగోడు ఫలితాల ఫై జై రాం రమేష్ కామెంట్స్

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో బిజెపి ఉంటె, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా రాబట్టలేకపోయింది. పోలింగ్ ముగిసే వరకు తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఫలితం చూశాక.. నోరెళ్లబెట్టింది. ఎన్నిక ఏదైనా మేము ఇంతే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. మునుగోడు ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. పేరుకే తెలంగాణ ఇచ్చిన పార్టీ.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఎన్నికలోనూ సత్తా చాటింది లేదు. 2014 నుంచి పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. 2018 తర్వాత జరిగిన హుజుర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జున్‌ సాగర్‌,హుజురాబాద్… ఇలా ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా ఉసూరుమనిపించింది. తాజాగా మునుగోడులో అదే తీరు ఫలితాలను మూటగట్టుకుంది. మొత్తంగా కలిపితే 20వేల ఓట్లు సాధించేందుకు కూడా అపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. నేటితో రాహుల్ తెలంగాణ యాత్ర పూర్తి కావడంతో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 11 రోజుల పాటు 8 జిల్లాల్లో 319 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిందని చెప్పారు. దక్షిణ భారత్ లోని ఐదు రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని, ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందన్నారు. నేటితో దక్షిణ భారత్ లో పాదయాత్ర ముగిసిందని, రేపటి నుంచి ఉత్తర భారత్ లో పాదయాత్ర మొదలవుతుందన్నారు. రాహుల్ పాదయాత్ర ఉపన్యాసాలు ఇచ్చే మన్ కీ బాత్ లాంటిది కాదని, ప్రజలు తమ సమస్యలను వినిపించుకునే పాదయాత్ర అని చెప్పారు. హైదరాబాద్ లోనూ ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ పాదయాత్ర నూతనోత్సాహం నింపిందన్నారు.

మునుగోడులో ఓట్ల ఎన్నిక జరగలేదని, నోట్ల ఎన్నిక జరిగిందని జైరాం రమేష్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, మద్యం, డబ్బుతో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి బాగా కష్టపడ్డారని, ప్రత్యర్థి అభ్యర్థులపై పోరాడారని చెప్పారు. తాము మునుగోడులో ఓడిపోయినందుకు ఏ మాత్రం బాధపడడం లేదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమిని, ప్రజల తీర్పును అంగీకరిస్తామన్నారు. ఉప ఎన్నికలో ఎందుకు ఓడిపోయామనే దానిపై ఆత్మపరిశీలనతో పాటు పార్టీలో సమీక్షించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని, ఆయన నుంచి వివరణ రాకపోతే చర్యలు ఉంటాయని చెప్పారు.