ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ని పరామర్శించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ని పరామర్శించారు. ఈ నెల ౩న (గురువారం) గంప గోవర్ధన్ మాతృమూర్తి రాజమ్మ అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కామారెడ్డి జిల్లా, బిక్కనూరు మండలంలోని గంప స్వగ్రామం బస్వాపూర్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ని మంత్రి కేటీఆర్ కలిసి పరామర్శించారు. గంప గోవర్ధన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి కేటీఆర్ వెంట మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు ఉన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరఎస్ పార్టీ విజయం సాధించడం తో పార్టీ శ్రేణులంతా సంబరాల్లో ఉన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వేళ..మునుగోడు లో విజయం సాధించడం శుభసూచికగా వారంతా పేర్కొంటున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండు నుంచి తుది వరకు రౌండు రౌండుకూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. నియోజకవర్గంలో ఏడు మండలాల్లోనూ మెజార్టీని సాధించింది. కారు స్పీడుతో కమలం రేకులు రాలిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ కూడా కాపాడుకోలేకపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వానికే మునుగోడు ప్రజలు పట్టం కట్టారు. మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 ఓటర్లు ఉండగా, రికార్డు స్థాయిలో 2,25,192 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. పోలైన మొత్తం ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 97,006, బీజేపీకి 86,697, కాంగ్రెస్‌కు 23,906 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 10,309 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.