‘ఖైదీ’ @ 40 ఇయర్స్ – చిరంజీవి ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ను మలుపుతిప్పిన చిత్రం ‘ఖైదీ’. 1983లో విడుదలైన ఈ చిత్రం నేటికీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది. చిరంజీవి, మాధవి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సంయుక్తా మూవీస్‌ పతాకంపై ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్‌.సుధాకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఖైదీ’ చిత్రం 1983 అక్టోబర్‌ 28న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై నాలుగు దశాబ్ధాలు పూర్తయింది. ఈ చిత్రంతో చిరంజీవి అభిమానుల గుండెలో శాశ్వత ఖైదీగా నిలిచిపోయారు. బెయిల్‌ దొరకని ‘ఖైదీ’ లా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బందీ అయిపోయారు.

అలాంటి ఈ గొప్ప చిత్రం నేటికీ 40 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత, మాధవిలని మొత్తం టీమ్ ని అభినందిస్తూ అంత గొప్ప విజయాన్ని మాకందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.