సామాన్య ప్రజలకు తీపి కబురు..మరింత తగ్గనున్న వంటనూనెల ధరలు..

నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతున్న వేళ…కేంద్ర సర్కార్ సామాన్య ప్రజలకు తీపి కబురు తెలిపింది. వంట నూనెల ధరలు మరింత తగ్గబోతున్నాయని తెలిపి వారిలో ఆనందం నింపింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత నిత్యావసర ధరలు పెరగడమే కానీ తగ్గే ప్రసక్తి లేకుండా పోయింది. ముఖ్యంగా పెట్రో ధరలు భారీగా పెరగడం వల్ల నిత్యావసర ధరలు పెరిగాయి. ఇక కూరగాయల ధరలు గురించి చెప్పాల్సిన పని లేదు. ఏ కూరగాయలు చూసిన కేజీ 80 లకు తక్కువ లేదు. ఈ ధరలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో కేంద్రం వంటనూనెలు ధరలు తగ్గబోతున్నాయని తెలిపి ఆనందం నింపింది.

వంటనూనెల ధరలు అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రిఫండ్ పామ్ ఆయిల్ పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన సుంకం 2022 మార్చి వరకు అమలులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా.. దేశీయ విపణిలో సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. బి సి డి తగ్గింపు కారణంగా రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ లపై మొత్తం సుంకం 19.25 శాతం నుంచి 13.75 శాతానికి తగ్గనుందని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక కొత్త రేటు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది.

నవంబర్ 2020 అక్టోబర్ 2021 మధ్య కాలంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పామాయిల్ విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతో పాటు.. రైతులకు చేయూత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది.

ముడి పామాయిల్, పలు ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలపై కేంద్రం నిషేధం విధించింది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అంతకు ముందు జూన్‌లో నూనె ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు రిఫైర్డ్‌ పామాయిల్‌ దిగుమతిపై కేంద్రం నిషేధం విధించింది.