రాళ్ల దాడి ఘటన ఫై మంత్రి జగదీశ్ స్పందన

Jagdish’s response to the stone pelting incident

Community-verified icon


మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరికొద్ది సేపట్లో ముగుస్తుందన్న క్రమంలో బిజెపి – టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువురు పరస్పరం రాళ్లు , కర్రలతో దాడి చేసుకున్న ఘటన మునుగోడు మండలం పలివెల గ్రామంలో చోటుచేసుకుంది. పలివెల గ్రామంలో ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి.

దీంతో పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా.. ఈ ఘటనపై ఈటల రాజేందర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చోద్యం చూస్తున్నారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఓటమి ఖాయమనే బిజెపి ఇలాంటి దాడులకు తెగబడుతుందని ఆరోపించారు. దాడి చేసింది బిజెపి కార్యకర్తలేనని , బిజెపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ కార్యకర్తలు సహనం కోల్పోవద్దని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుందామని అన్నారు.