భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక..

తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గోదావరి నది 53 అడుగులకు చేరడం తో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఒడ్డున ఉన్న గ్రామాల్లోకి నీరు చేరింది. అయినవల్లి, పి. గన్నవరం, ఐ. పోలవరం, మామిడికుదురు, అంబాజీపేట, ముమ్మిడివరం, మల్కిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లో ముంపునకు గురికావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు పి. గన్నవరం, అల్లవరం, మామిడికుదురు మండలాల్లోని గ్రామస్తులు బోటు రాకపోకలను నిలిపివేశారు.

మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న వరద వల్ల ఈసారి గోదావరికి వరద పోటు ఎక్కువగా కనిపిస్తోంది. . అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక గ్రామాలను ఇప్పటికే గోదావరి చుట్టేసింది. ప్రధానమైన రహదారులతో పాటు గ్రామాల చుట్టూ కూడా గోదావరి పోటెత్తుతోంది. అనేక లంక గ్రామాలు సైతం వరద ముంపులో చిక్కుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇక తెలంగాణపై వరుణుడి ప్రతాపం తగ్గడం లేదు. వరుసగా సోమవారం కూడా కుండపోత వానలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాపై పంజా విసరగా.. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొల్లూరులో అత్యధికంగా 189 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లావెంకటాపురంలో 180 మిల్లిమీటర్లు, నీల్వాయిలో 161, కొత్తపల్లిలో 153 మిల్లిమీటర్ల వర్షం కురవగా.. భద్రాదికొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 161మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కొమురం భీమ్ జిల్లా బెజ్జూరులో 13, భూపాలపల్లిలో 11 సెంటిమీటర్ల వర్షం కురిసింది. భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాకలో 12, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురిశాయి.