కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలే – బండి సంజయ్

బంగారిగడ్డ సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలే అన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. ఈ క్రమంలో చివరి రోజు ప్రధాన పార్టీల నేతలంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పలు ఉద్రిక్త సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడారని బండి సంజయ్ అన్నారు.

మునుగోడులో ఎంతో మంది యువకులు పెద్ద చదువుల చదివి హైదరాబాద్ లో డ్రైవర్లుగా మారారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ లిస్ట్ విడుదల చేయాలన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాల ద్వారా ఎంత మంది లబ్దిపొందారో చూడాలన్నారు. కేసీఆర్ నిర్ణయం వల్ల 34 మంది ఆర్టీసీ కార్మికులు బలయ్యారని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం అశ్వద్ధామ రెడ్డి బలయ్యారని చెప్పారు. అశ్వద్ధామ రెడ్డి తన ఉద్యోగాన్ని కోల్పోయారని తెలిపారు. ఓటు వేసేముందు ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని కోరారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందని గుర్తు చేశారు. కేసీఆర్కు తొత్తులుగా టీఎన్జీవోలో ఇద్దరు ముగ్గురు నేతలు మారారని మండిపడ్డారు.