తొలిరోజే విద్యార్థులకు ‘విద్యాకానుక’ అందిస్తున్న జగన్ సర్కార్

నేటి నుండి ఏపీలో స్కూల్స్ పున:ప్రారంభమయ్యాయి. ఎండలు ఎక్కువగా ఉండడం తో ఈ నెల 17 వరకు హాఫ్ డేస్ స్కూల్స్ నడపనున్నారు. కాగా పాఠశాలలు పున : ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు ‘విద్యాకానుక’ అందిస్తున్న ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో సీఎం జగన్ లాంచనంగా ప్రారంభించనున్నారు.

విద్యా కానుక కిట్లలో బైలింగువల్ పాఠ్య పుస్తకాలు ( ఒక పేజీలో ఇంగ్లీష్ మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు), నోట్ బుక్‌లు, వర్క్‌బుక్‌లు, 3జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ (6-10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1-5 తరగతి పిల్లలకు) ఉండనున్నాయి. “జగనన్న విద్యాకానుక” కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యత పరీక్షలు కూడ పూర్తి చేశారు. ప్రతి విద్యార్థికి దాదాపు రూ.2,400ల విలువైన విద్యా కానుక పంపిణి చేస్తున్నట్లుగా సర్కార్ చెబుతోంది.