ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారంలో సిట్ ఏర్పటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. ఈ కేసుపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ బుధువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన మరునాడే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ అధ్య‌క్ష‌త‌న సిట్‌ను ఏర్పాటు చేశారు. న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి స‌భ్యులుగా కొన‌సాగ‌నున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సత్వర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేరొన్నది.

మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రామచంద్రభారతి, కోరె నందకుమార్‌, సింహయాజి ప్రయత్నించిన సమయంలో పోలీసులు కుట్రను ఛేదించి వారిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే.