ముగిసిన సీఎం జగన్‌ ముంపు గ్రామాల పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం.. నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకున్నారు.

వరద బాధితులకు సహాయం అందించడానికి గతంలో ఎప్పుడు లేని విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ముంపు గ్రామాల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించడానికి చర్యలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. పరిహారం అందనివారికి మరింత గడువు ఇచ్చి పూర్తి పరిహారం ఇస్తామని ఆయన శుభవార్త చెప్పారు. ముంపు గ్రామాలను తరలించేందుకు వారికి త్వరగా పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. పరిహారం చెల్లించేందుకు 20వేల కోట్లు అవసరం వుంది.. దీనికి కేంద్రం నుంచి సహకారం అవసరమని, కేంద్రం నుంచి మనకి రావాల్సిన బకాయిలు చాలా వున్నాయి..ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో చలనం ఉండటంలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన పరిహారం అందించే ఏర్పాటు చేస్తామన్నారు.

వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదు. ముంపు బాధితులకు అండగా ఉంటామన్నారు. వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.