రేపు కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన

రేపు వైఎస్సార్‌ మత్య్సకార భరోసా నిధులు జమ కానున్నాయి. ఈ క్రమంలో రేపు కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్‌ మత్య్సకార భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టననున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను ఖరారు చేసారు.

రేపు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్‌… 10.20 గంటలకు ఐ పోలవరం మండలం కొమరగిరి చేరుకోనున్నారు. 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొననున్న జగన్‌… మధ్యాహ్నం 1.20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇక సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో… అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.

ఇక వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. దీంతో ఉపాధి కోల్పోయే అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఈ నగదు ద్వారా జీవన భృతి లభించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు భృతి అందుతుంది. దీనికి అదనంగా మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని కూడా అందిస్తోంది.