కేంద్ర ఎన్నిక‌ల సంఘం చీఫ్‌గా రాజీవ్ కుమార్ నియామ‌కం

ఎల్లుండి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సుశీల్ చంద్ర‌
15న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న రాజీవ్ కుమార్‌

న్యూఢిల్లీ: భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌విలో కొన‌సాగుతున్న సుశీల్ చంద్ర ఎల్లుండి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆ మ‌రుసటి రోజు.. అంటే ఈ నెల 15న సీఈసీగా రాజీవ్ కుమార్ ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్రప‌తి ఆమోదం తెలిపిన‌ట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు గురువారం తెలిపారు. 2020 సెప్టెంబ‌ర్ 1న కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేపట్టిన రాజీవ్ కుమార్ తాజాగా సీఈసీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

ఇక రాజీవ్ కుమార్ వ్యక్తిగ‌త వివ‌రాల్లోకి వెళితే…1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయ‌న బీహార్‌, జార్ఖండ్ కేడ‌ర్ అధికారిగా త‌న వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కేంద్ర స‌ర్వీసుల‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆర్బీఐ, సెబీ, నాబార్డ్‌ల‌లో డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆర్థిక రంగానికి చెందిన ప‌లు ఇత‌ర సంస్థ‌ల‌కు కూడా రాజీవ్ కుమార్ సేవ‌లందించారు. ఎన్నిక‌ల క‌మిష‌నర్‌గా బాధ్య‌త‌లు చేపట్టక ముందు ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెలెక్ష‌న్ బోర్డు చైర్మ‌న్‌గా ఆయ‌న వ్యవ‌హ‌రించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/