పారిస్‌కు బయలుదేరిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పారిస్ కు బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్‌ బయలుదేరారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు ఆయ‌న కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు వీడ్కోలు ప‌లికారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు జగన్ పారిస్‌ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ వేడుకలో పాల్గొననున్నారు. జగన్-భారతి దంపతుల పెద్దకుమార్తె హర్ష పారిస్‌లోని ప్రఖ్యాత బిజినెల్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. దీనికి సంబంధించి క్యాంపస్‌లో కాన్వొకేషన్ జులై 2న నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు జగన్ సతీసమేతంగా పారిస్‌కు వెళ్తున్నారు. కాన్వొకేషన్ పూర్తికాగానే జులై 3న వారు రాష్ట్రానికి తిరిగిరానున్నారు. త‌న కుమార్తె స్నాత‌కోత్సవానికి వెళ్లేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ జగన్ ఇటీవలే నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్‌ పారిస్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని, ఆయన విదేశాలకు వెళ్తే కేసుల విచారణ ఆలస్యం అవుతుందని కోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ అధికారుల వాదనను తోసిపుచ్చిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటనకు వెళ్లొచ్చని ఆదేశాలిచ్చింది.