పేదరికపు సంకెళ్లను తెంచుకునేందుకు ఉన్న ఒకే ఒక అస్త్రం చదువు

జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేసిన సిఎం జగన్‌

jagan-speech-from-anantapur-district

అమరావతిః సిఎం జగన్‌ అనంతపురం జిల్లాలో బుధవారం జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చదువుకున్న శక్తి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కులాల చరిత్రను, కుటుంబాల పరిస్థితిని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అన్నారు. పేదరికం సంకెళ్లను తెంచేసే అస్త్రం చదువొక్కటేనని ఆయన స్పష్టం చేశారు. చదువు విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లు రాష్ట్రంలో విద్యార్థులకు అండగా నిలబడుతూ వస్తున్నామని వివరించారు.

పిల్లల చదువుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా అప్పులపాలు కావొద్దనే సదుద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం తీసుకొచ్చామని జగన్ వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నతచదువులకు దూరం కావొద్దని అనేక పథకాలు అమలు చేస్తున్నామని, జగనన్న వసతి దీవెన కూడా అందులో ఒకటని తెలిపారు. ఈ పథకం కింద ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఐటీఐ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.20 వేలు జమ చేస్తున్నామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని 9,55,662 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.912.71 కోట్లు ఈ రోజు (బుధవారం) జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత బటన్ నొక్కి నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వివరించారు.