శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొని, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రెండ్రోజుల తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌ నేరుగా.. తిరుపతి బర్డ్‌ ఆస్పత్రికి చేరుకొని శ్రీపద్మావతి చిన్నపిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకొని మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గోమాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోమందిరం, గోతులాభారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయ‌ణ‌స్వామి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు. రేపు వేంకటేశ్వరుని సేవలో పాల్గొననున్న సీఎం ..ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్‌ను కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభిస్తారు. ఆలయ సమీపంలో నిర్మించిన లడ్డు బూందీ పోటునూ ప్రారభించనున్నారు.

అలాగే రేపు జగన్ దుర్గమ్మ ను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు.