ఘ‌నంగా జ‌గ‌న్ ముంద‌స్తు పుట్టిన రోజు వేడుక‌లు

ఏపీలో జగన్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. ఈ నెల 21 న జగన్ పుట్టిన రోజు సందర్భాంగా రాష్ట్రంలో ముందస్తుగానే పుట్టిన రోజు వేడుకలు మొదలుపెట్టారు. సోమవారం బొబ్బిలి పురపాలక సంఘం 30వ వార్డులో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు స్థానిక శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, బుడా ప్రతినిది ఇంటి గోపాలరావు,కౌన్సిలర్లు వాడపల్లి వనజ కుమారి,బొత్స రమణమ్మ, వైస్సార్సీపీ నాయకులు వాడపల్లి మనోజ్, రేజేటి ఈశ్వరరావు,మండల జనార్ధన్,దిబ్బగోపి,తుట్ట తిరుపతి,పట్టణంలో గల ముఖ్య నాయకులు, తదితరులు హాజరయ్యారు.

మరోపక్క జగన్ పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు చెప్పేందుకు నేతలు ఇప్పటి నుంచే విభిన్న మార్గాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైస్సార్సీపీ అభిమానులతో పాటు పార్టీ నేతలు, అధికారులు ఏదో ఒక రూపంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతగా జగన్ కు ఉన్న ఫాలోయింగ్ ను బట్టి చూస్తే ప్రతీ ఒక్కరూ జగన్ కు శుభాకాంక్షలు చెప్పడం కష్టం కూడా. ఇందుకోసం తపాలాశాఖ ఓ సౌకర్యాన్ని అందిస్తోంది.

కేవలం10 రూపాయలు చెల్లించడం ద్వారా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా పంపొచ్చని అధికారులు చెప్తున్నారు. పోస్టాఫీస్ కౌంటర్ కు వెళ్లి రూ.10 చెల్లిస్తే ఈ-పోస్ట్ ద్వారా జగన్ కు పంపే వారి పేరు, అడ్రస్ తో శుభాకాంక్షలు పంపుతామని తపాలాశాఖ అధికారులు చెబుతున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ఈ సదుపాయం అందుబాటులో ఉంచనున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈసారి తపాలాశాఖ ద్వారా జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.