నేడు ఒంగోలు జగన్ పర్యటన : వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత డబ్బులు విడుదల

cm jagan

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలు లో వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత నగదు పంపిణి చేయబోతున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్‌ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత బందర్‌ రోడ్‌లోని రవిప్రియ మాల్‌ అధినేత కంది రవిశంకర్‌ నివాసానికి వెళతారు. వారింట్లో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని ఈ పథకం ద్వారా విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే దాదాపు కోటి మంది మహిళలకు ఖాతాల్లోకి సున్నా వడ్డీ పథకం కింద 1261 కోట్లను సీఎం జగన్ ఒంగోలు నుంచి జమ చేయనున్నారు. ఈ సొమ్ము తో ఇప్పటిదాకా 3600 15 కోట్ల ను మహిళలకు అందించినట్లు అవుతుంది.

ఇక సీఎం ఒంగోలు పర్యటన ఏర్పాట్లను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ తదితరులు పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లా కేంద్రంలో ప్రారంభించడం ద్వారా ప్రకాశంకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 31, 2019న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు జిల్లాకు నాలుగుసార్లు వచ్చారు. నేడు ఐదోసారి వస్తున్నారు. ముఖ్యమంత్రి రాకతో పండుగ వాతావరణం నెలకొంది.