చైనాను జ‌వాబుదారీ చేయాలి..అమెరికా

క‌రోనా మూలాలపై లోతుగా ప‌రిశోధ‌న జ‌ర‌పాలి.. ఆంటోనీ బ్లింకెన్

వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ… క‌రోనా వైర‌స్ పుట్టుక ర‌హ‌స్యాన్ని ఛేదించేందుకు దాని మూలాలపై లోతుగా ప‌రిశోధ‌న జ‌ర‌పాలని అన్నారు. క‌రోనా మూలాల‌ను క‌నుగొనాల‌ని ప్ర‌పంచంలోని చాలా దేశాల నుంచి మ‌రోసారి పెద్ద ఎత్తున డిమాండ్ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా బ్లింకెన్‌ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… క‌రోనా మూలాల‌ను క‌నుగొంటే మ‌రో మ‌హ‌మ్మారి రాకుండా నివారించగలుగుతామని, కనీసం దాని తీవ్రతనైనా త‌గ్గించ‌వ‌చ్చని అన్నారు. ఈ ముఖ్య కార‌ణాల వ‌ల్లే తాము క‌రోనా మూలాల‌ను క‌నుక్కోవాల‌ని చెబుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా వైర‌స్‌ మూలాల‌ను క‌నుగొనే విష‌యంలో జో బైడెన్ ప్ర‌భుత్వం దృఢ‌నిశ్చ‌యంతో ఉంద‌ని ఆంటోనీ బ్లింకెన్ వివ‌రించారు. క‌రోనా పుట్టుక గురించి తాము అడుగుతోన్న విష‌యాల‌పై చైనా పార‌ద‌ర్శ‌క స‌మాచారాన్ని ఇవ్వ‌ట్లేద‌ని చెప్పారు. క‌రోనాకు సంబంధించిన స‌మాచారం మొత్తాన్ని చైనా ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా పుట్టుక గురించి ప‌రిశోధ‌న‌లు జ‌రిపేందుకు వ‌చ్చేందుకు ప్ర‌పంచ నిపుణుల‌కు పూర్తి స్థాయిలో అనుమ‌తులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/