సీఎం జగన్ ఫై దాడి కేసులో ట్విస్ట్..టీడీపీ నేతను వదిలిన పోలీసులు

వైసీపీ అధినేత , సీఎం జగన్ ఫై జరిగిన దాడి కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఇటీవల అదుపులోకి తీసుకున్న TDP నేత దుర్గారావును పోలీసులు వదిలిపెట్టారు. కేసుతో ఆయనకు సంబంధం లేదని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ కేసులో అరెస్టైన సతీశ్ రిమాండ్ రిపోర్టులో A-2 ప్రోద్బలంతోనే దాడి చేసినట్లుగా పోలీసులు పేర్కొనగా.. ఇప్పుడు A-2 నిందితుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.

విడుదలైన అనంతరం దుర్గారావు మాట్లాడుతూ “ఈనెల 16వ తేదీన సింగ్‌ నగర్‌ డాబాకొట్ల రోడ్డులోని టీకొట్టు వద్ద టీ తాగుతున్నా అంతలోనే పోలీసులు వచ్చి మాట్లాడాల్సిన పని ఉందంటూ వాహనం ఎక్కించారు. ఇంటరాగేషన్‌ మొదలుపెట్టారు. నేను ఏ తప్పూ చేయలేదన్నాను. నీ వెనుక ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. అసలు నేను ఆ పని చేయనప్పుడు ఎవరుంటారని గట్టిగా జవాబిచ్చాను. సీసీఎస్‌లో నన్ను, సతీష్‌ను పక్కపక్క గదుల్లో ఉంచి విచారణ చేశారు. పోలీసులు నా వద్దకు వచ్చి జగన్‌పై రాయి వేస్తే రూ. వెయ్యి ఇస్తానన్నావట కదా అని అడిగారు. సతీష్‌ నాకు పరిచయం లేదని చెప్పాను. దీంతో ఇద్దరినీ కలిపి విచారించారు. నేను నిర్దోషినని పోలీసులకు అర్థమైంది. అందుకే నన్ను వదిలిపెట్టారు”అని దుర్గారావు వివరించారు.

అంతకు ముందు దుర్గారావు ఆచూకీ విషయమై శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట దుర్గారావు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దాదాపు 60 మంది వడ్డెర కులస్థులు సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీహరి నేతృత్వంలో మహిళా పోలీసులు వారిని చుట్టుముట్టారు. రోడ్డుపై నిరసనలకు వీల్లేదంటూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళలను, సంఘ పెద్దలను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు. నాలుగు రోజులుగా దుర్గారావును ఎక్కడ దాచి ఉంచారని మహిళలు ప్రశ్నించారు. కష్టపడి పనిచేసుకుని బతికే తమను రోడ్డు పైకి ఈడ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసుల్లో వడ్డెరలను ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.