విజయవాడ దుర్గమ్మ ఆలయ టికెట్‌పై వివాదం

విజయవాడ దుర్గమ్మ ఆలయం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో నిలువగా..తాజాగా విజయవాడ దుర్గమ్మ ఆలయ టికెట్‌పై వివాదం చెలరేగింది. ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న కనకదుర్గమ్మ పేరున ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పేరుని శ్రీ సూర్య మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంగా మార్చి టికెట్స్ ఇవ్వడం ఫై టీడీపీ ఫైర్ అయ్యింది.

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దేవస్థానం బస్సులు నడుస్తున్నాయి. ఆలయానికి సంబంధించి మొత్తం తొమ్మిది బస్సులు ఉన్నాయి.. అందులో నాలుగు బస్సులను ప్రతి రోజూ విజయవాడ రైల్వేస్టేషన్, బస్టౌండ్ నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గగుడికి నడుస్తున్నాయి. మరో మూడు బస్సులను కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్‌ నుంచి నడుస్తున్నాయి. రెండు బస్సులు స్టాండ్‌ బైగా ఉంచింది దేవస్థానం. ఈ బస్సుకు టికెట్ ధర రూ.10 నిర్ణయించారు.

టికెట్‌పై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం బదులుగా శ్రీ సూర్య మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పేరుతో ప్రింట్ చేశారు. మిగిలిన వివరాలను కూడా ప్రస్తావించారు. అయితే దుర్గా మల్లేశ్వర స్వామి పేరు బదులు శ్రీ సూర్య మల్లేశ్వర స్వామి పేరును ప్రింట్ చేయడంపై టీడీపీ విమర్శలు చేస్తుంది.