కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడి వివాహ వేడుకలో పాల్గొన్న జగన్

వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు శివనరసింహారెడ్డి, రూపశ్రీల వివాహానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్‌ పాఠశాలలో ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

కాగా, ఈ వివాహం కోసం కర్నూలు విచ్చేసిన సీఎం జగన్ కు ఓర్వకల్లు విమానాశ్రయంలో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, నగర మేయర్ రామయ్య తదితరులు స్వాగతం పలికారు. అయితే జగన్ పర్యటనలో భద్రతా లోపంపై విమర్శలు వెల్లువడుతున్నాయి. పోలీస్ ప్రోటోకాల్ ప్రకారం కల్యాణ వేదికపై కాటసాని కుటుంబీకులు, జగన్‌కి మాత్రమే అనుమతి కలిపించారు.

అయితే స్టేజీ వెనక నుంచి ఉన్నట్లుండి ఓ దివ్యాంగురాలు ప్రత్యక్షమై ముఖ్యమంత్రి జగన్ కాళ్లమీద పడింది. బాధిత యువతి స్టేజి వెనక నుంచి ఒక్కసారిగా సీఎం ముందుకు రావడంతో అధికారులు షాక్ అయ్యారు. బాధిత యువతితో జగన్ మాట్లాడారు. అయితే యువతి స్థానంలో ఇంకొకరు ఉండి.. జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగి ఉంటే ఏంటన్న దానిపై వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.