భాగ్యనగరంలో మరోసారి ఐటీ దాడులు

భాగ్యనగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ , బిజినెస్ నేతలకు సంబదించిన కార్యాలయాల్లో దాడులు జరిపిన ఐటీ అధికారులు..తాజాగా గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసారు. దిల్‌సుఖ్ నగర్‌లో ఉన్న గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని యాసిన్ ఫాతిమా అక్బర్ షేక్ ఇండ్లతో పాటు పది చోట్ల సోదాలు నిర్వహిస్తారు అధికారులు. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై కూడా అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఫార్మాహిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ కంపెనీలల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌లోని 20 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

కాగా కొన్నిరోజుల క్రితం కూడా ఐటీ అధికారులు పలు ఫార్మా కంపెనీల్లో దాడులు చేసిన సంగతి తెలిసిందే. వీరు పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలు లభించినట్టు తెలుస్తుండగా..దీని ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. హైదరాబాద్ లో వరుస ఐటీ రైడ్స్ పలు కంపెనీలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఏ సమయంలో ఐటీ రైడ్స్ జరుగుతాయో అని భయపడుతున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ కంపెనీలో టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నాయి.