మద్యాదాయమే ‘మహాప్రసాదమా’?

‘ఒక్కమాట’ (ప్రతి శనివారం )

Liquor sales
Liquor sales

ముఖ్యాంశాలు

  • లక్షలాది మందిని బలితీసుకుంటున్న మద్యం మహమ్మారి
  • పాలకులే జనానికి మద్యం ఎక్కించే ప్రయత్నం
  • ఇది ఎంతవరకు సమంజసమో పెద్దలు మనసు పెట్టి ఆలోచించాలి

తాగుడుకు బానిసలై మగ్గిపోతున్న కుటుంబాల్లోని మహిళల ఆవేదన ఇది. మొన్న మద్యం షాపుల తలుపులు తెరిచిన తర్వాత తాగివచ్చి భర్తచేసే వికృత చేష్ఠలు భరించలేక ఏకంగా గొంతుకోసి చంపింది ఓ ఇల్లాలు, అన్నను చంపాడు ఒక తమ్ముడు., నిన్న తాగుడుకు డబ్బులివ్వలేదని తండ్రినే కొట్టి చంపాడొక కుమార రత్నం. ఒక్కటికాదు, రెండుకాదు..

ప్రపంచవ్యాప్తంగా చూసినా ప్రతి 10 సెకన్లకు ఒకరి వంతున కబళిస్తూ ప్రపంచవ్యాప్తంగా యేడాదికి 30 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బలి తీసుకుంటున్నది. రానురానూ దీని వినియోగం పెరిగిపోతున్నది. ఏదేమైనా పాలకులే పూనుకుని జనానికి మద్యం ఎక్కించే ప్రయత్నం చేయడం అత్యంత దురదృష్టకరం.

ఒకపక్క ప్రజాసంక్షేమంటూ, మరొకపక్క ప్రజలను ఆరోగ్య, ఆర్థికపరంగా సంక్షోభంలోకి నెట్టడం ఏమాత్రం సమంజసం కాదు.

అంతేకాదు యేటా క్రమంతప్పకుండా మహాత్ముడిని స్మరించుకుంటూ ఆయనకు వర్ధంతులు, జయంతులు నిర్వహించుకుంటూ ఆయనే ఆదర్శమని ఉపన్యాసాలిచ్చే పెద్దలు ఆయన ఆశయానికి తిలోదకాలివ్వడం ఎంతవరకూ సమంజసమో మనసుపెట్టి ఆలోచించాలి.

‘దొరతనంబు నందు దొంగతనంబు నందు భాగ్యవంతుడికి ఏదైనా బాధలేదు అని ఎవరిని ఉద్దేశించి ఏ సందర్భంలో అన్నారోగానీ, ఇందులో చాలా అర్థం ఉంది.

అంతకు పూర్వం కూడా శ్రీనాథ కవి ‘సిరి గల వారికి ఎందరు భార్యలున్నా ఫర్వాలేదు గానీ.. భిక్షమెత్తుకునే నీకెందుకు ఇద్దరు భార్యలని ఏకంగా పరమశివున్నే ప్రశ్నించారు. అప్పుడే కాదు. ఇప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం లేకపోతే.. జీవనం సాగించడం ఎంత దుర్భ రంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.

వ్యక్తి, కుటుంబం, ప్రభు త్వంగానీ ఆదాయం లేకుండా నడవడం, నడపడం సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం.

అందులో ప్రజాసంక్షేమమే ధ్యేయ మని చెప్పుకుంటూ, నిరుపేద, బలహీన, బడుగువర్గాల అభ్యు న్నతికి వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ రోజుల్లో నిధులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకోసం ప్రజలమీద భారం వేయకతప్పదు.

కానీ అందుకు ఒక పద్ధతి, విధానం, మార్గం ఉండాలి. ఏ పన్నులు వేసినా, మరో రూపంలో నిధులు సేకరించినా ప్రజలకు అందువల్ల కష్టనష్టాలు ఉండకూ డదు. పిల్లి తన పిల్లలను తీసుకుని వెళ్లినట్లుగా ప్రజా పాలకుల వ్యవహారం ఉండాలంటారు.

నోటితో పట్టుకుని కింద పడకుండా ఒక చోటు నుంచి మరొక చోటుకు దూకుతూ, పరిగెడుతూ పిల్లి తన పిల్లలను తీసుకుని వెళుతుంది. పిల్లలు కింద పడవు, అలా అని పంటి గాట్లు ఉండవు, నొప్పి ఉండదు. ప్రభుత్వం ప్రజలపై వేసే భారం అలా ఉండాలి.

ఆదాయంకోసం ప్రభుత్వం మద్యం విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆర్థికంగానే కాదు, ఆరోగ్యపరం గా కూడా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.

ముఖ్యంగా ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితుల్లో మద్యానికి తెరలేపడంమాత్రం ఏ కోణంలో చూసినా సమంజసం అనిపిం చదు. కరోనా మహమ్మారితో మొత్తంమానవాళే అట్టుడుకిపోతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా మరణించగా.. నలభై నాలుగులక్షల మందికి పైగా సోకింది. ఈ వ్యాధిని ఎలా నియంత్రించాలో, ఎలా నిరోధించాలో అంతు పట్టడం లేదు. ముఖ్యంగా మహమ్మారి సోకకుండా, విస్తరించ కుండా కట్టడిచేసేందుకు మన శాస్త్రవేత్తలే కాదు,

ప్రపంచవ్యాప్తంగా తలలుపండిన శాస్త్రజ్ఞులు రాత్రింబగళ్లు పరిశోధనా శాలల్లో ఉంటూ నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ఈ యేడాది ఆఖరి వరకూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

మరొకపక్క ఈ వ్యాధి ఉధృతం తగ్గకపోగా, వర్షాకాలంలో మరిం త జోరు పెరిగే అవకాశమున్నట్లు చెపుతున్నారు.

ఇక పరిస్థితిని అదుపుచేసి ప్రాణ నష్టం జరగకుండా, వ్యాధి సోకకుండా తీసుకుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఇతర దేశాలతో పోల్చినా మన దేశం ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కొంతమేరకు ముందు వరుసలోనే ఉన్నాయనే చెప్పవచ్చు.

రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. లాక్‌డౌట్‌ ఉండనే ఉంది.

మూడవ దశ పూర్తికాబోతున్నా, నాలుగో దశ కూడా ఉండబోతు న్నట్లు సంకేతాలు వినబడుతున్నాయి. కొన్ని సడలింపులతో కొన సాగుతుందని చెబుతున్నారు. మొత్తం విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి.

ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎక్కడికక్కడ తనిఖీలతో నిర్బంధం చేస్తున్నారు. 130 కోట్ల మంది భారతీయులు ఎక్కడి వారక్కడే ఉండిపోయారనే చెప్పవచ్చు. వివాహాలు వాయిదా పడ్డాయి.

ప్రాణాపాయస్థితిలో చేసే వైద్యంతప్ప ఇతర వైద్య సేవల్నీ, ఆస్ప్రతులను యజమాన్యాలు నిలిపివేశాయి. అంతో ఇంతో ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు కేంద్రాలైన, పవిత్ర దేవా లయాల్లోకి ప్రజల ప్రవేశాలను నిషేధించారు.

మొత్తంమీద మానవ జీవనం అస్తవ్యస్తమే కాదు, సంభించిపోయిందికూడా. కోట్లాది మంది పడిన, పడుతున్న ఇబ్బందులన్నీ ఇన్నీ కావు. అందరికంటే వలస కూలీల బాధలు మాటలకు అందవు. ఎందరో అనారోగ్యం పాలయ్యారు.

వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ తమ స్వగ్రామాలకు కాలి నడకన బయలుదేరారు. ఇక ఇరుకుగదుల్లో ఉండలేక మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలుకూడా ప్రారంభమయ్యాయి.

మొన్న బుధవారం హైదరాబాద్‌లో 15 అంతస్తుల భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్ప డింది. కేవలం ఇంటికి వస్తానంటే..

లాక్‌డౌన్‌లో ప్రయాణంచేసి మధ్యలో ఇరుక్కుపోతావని తల్లి వద్దని చెప్పడంతో మనఃస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి సంఘటనలెన్నో జరుగు తున్నాయి.

ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడానికి కార ణం ప్రజాశ్రేయస్సే. అందులో మరో వాదనకు తావులేదు. ప్రభు త్వం ఇంతటి తీవ్రచర్యలు తీసుకున్నందువల్లే ఈ మాత్రమైనా కట్టడి చేయగలిగినట్లు చేసే వాదనలుకూడా కొట్టివేయలేం.

ఈన గాసి ఎవరిపాలో చేసినట్లు ఇంతకాలం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రజా సంక్షేమమని చెప్పుకునే పాలకులు ఏకంగా మద్యం అమ్మ కాలకు తలుపులు తెరవడంపట్ల ప్రజాస్వామ్యవాదులు ఆవేదన చెందుతున్నారు. ఆదాయం అవసరమేకావొచ్చు.

మద్యంవల్ల వచ్చే ఆదాయంతో సంక్షేమం కాదు, సంక్షోభమే వస్తుందనే వాదనను కొట్టివేయలేం. మద్యనిషేధమన్నది

మహాత్ముడు భారత ప్రజలకు అందించిన అమృత సందేశం. ఆదాయంకోసం ప్రభుత్వమే దుకా ణాలు పెట్టించి మద్యం సేవించండి, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చండి అంటూ బ్రతిమాలి, భంగపడి తాగించే దురదృష్టపు రోజులుదాపురించాయి.

మద్యంవల్ల ఎన్ని కోట్లమంది అనారోగ్యం పాలౌతున్నారో లెక్కలకే అందవు. హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలకు ఒక్కటేమిటి అన్ని నేరాలూ, అనర్థాలకూ మద్యం మూలమనే విషయం పాలకులకు కూడా తెలియనిది కాదు.

గతంలో కరీంనగర్‌ జిల్లాలో ఈ రచయిత పనిచేస్తున్నప్పుడు మల్యాలప్రారతంలో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేం దుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అప్పటి పార్లమెంట్‌ సభ్యు డు జువ్వాడి చొక్కారావు, కేతిరి సాయిరెడ్డి, జిల్లా కలెక్టర్‌పాటు పలువురు అనధికార ప్రముఖులతో కలిసి వెళ్లాం.

సాయంత్రం 6 గంటల ప్రారతంలో తిరిగి వస్తుండగా, వరి కోతకు వెళ్లి ఇంటి ముఖంపట్టిన మహిళా కూలీలు ఎదురయ్యారు.

వారిని చూడగానే కారు ఆపి, చొక్కారావు దిగి ప్రభుత్వ పనితీరును ప్రశ్నించగా, రెండు రూపాయలకు కిలో బియ్యం, కిరోసిన్‌ అన్నీ సక్రమంగా అందుతున్నాయని, కానీ సారావల్ల తమకెంతో నష్టం జరుగుతున్న దని వాపోయారు.

అధికారులు వారి మాటలకు అడ్డు తగులుతూ బియ్యం కావాలంటారు, నీళ్లు కావాలంటారు, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాము,

వాటన్నింటికీ డబ్బు ఎక్కడినుంచి వస్తుందని నిలదీశారు. వెనక ఉన్న 20 యేళ్ల యువతి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తే.. చొక్కరావు జోక్యం చేసుకుని ముందుకు పిలిచి చెప్పమన్నారు.

‘ఒక్కసారిగా ఆ యువతి ముందుకువచ్చి సారా అంగట్లేమిటి సార్‌, బ్రోతల్‌ సెంటర్లు (వ్యభిచార కేంద్రాలు) పెట్టించండి, వాటికి లైసెన్స్‌లు ఇవ్వండి, మీ ఆదాయానికి ఫీజులు నిర్ణయించండి అంటూ, అప్పుడు ఆదాయం బాగా వస్తుంది,

ఇదే కాదు మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చంటూ అధికారులపై విరుచుకుపడింది. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు.

ఆమె మాట్లాడిన మాటల్లోని ఆవేదన అందరికీ అర్థమైంది. అప్పుడే కాదు. ఇప్పుడుకూడా తాగుడుకు బానిసలై మగ్గిపోతున్న కుటుంబాల్లోని మహిళల ఆవేదన ఇది.

మొన్న మద్యం షాపుల తలుపులు తెరిచిన తర్వాత తాగివచ్చి భర్తచేసే వికృత చేష్ఠలు భరించలేక ఏకంగా గొంతుకోసి చంపింది ఓ ఇల్లాలు, అన్నను చంపాడు మరో తమ్ముడు. నిన్న తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రినే కొట్టి చంపాడొక కుమార రత్నం.

ఒక్కటికాదు, రెండుకాదు ప్రపంచవ్యాప్తంగా చూసినా ప్రతి 10 సెకన్లకు ఒకరి వంతున కబళిస్తూ ప్రపంచవ్యాప్తంగా యేడాదికి 30 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బలితీసుకుం టున్నది. రానురానూ దీని వినియోగం పెరిగిపోతున్నది.

ఏదేమై నా పాలకులే పూనుకుని జనానికి మద్యంఎక్కించే ప్రయత్నం చే యడం అత్యంత దురదృష్టకరం.

ఒకపక్క ప్రజాసంక్షేమంంటూ మరొకపక్క ప్రజలను ఆరోగ్య, ఆర్ధికపరంగా సంక్షోభంలోకి నెట్టడం ఏమాత్రం సమంజసం కాదు.

మహాత్ముడిని స్మరించుకుంటూ ఆయనకు వర్ధంతులు, జయంతులు నిర్వహించకుంటూ ఆయనే ఆదర్శమని ఉపన్యాసాలిచ్చే పెద్దలు ఆయన ఆశయానికి తిలోదకాలివ్వడం ఎంతవరకూ సమంజసమో మనసుపెట్టి ఆలోచించాలి.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/