ఫలితాలు వచ్చిన కాసేపటికే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చాయో లేదో..వెంటనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సరం మాదాపూర్ నారాయణ కాలేజీలో బైపిసి చదివాడు. మంగళవారం రోజున ఇంటర్ ఫలితాలు రావడంతో ఒంటరిగా ఉన్న ప్రజ్వల్ రిజల్ట్ చూసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తో తండ్రి వెంటనే అప్రమత్తమై.. ఇంటికి వెళ్లి చూడామణి తన వద్ద పనిచేస్తున్న నర్సును పంపించాడు. ఆమె కనిపించలేదని చెప్పడం తో.. ఆయన తల్లి, తండ్రి పైకి వెళ్లి చూడడంతో బెడ్ రూమ్ లో ఉరివేసుకొని ప్రజ్వల్ కనబడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా మరణించాడని తెలిసింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు నెలకొన్నాయి.

నేడు ఇంటర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మం నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో జ‌రిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. మొత్తం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. కాగా, బాలిక‌లు 68.68 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.