త్రిపుర గవర్నర్ గా తెలంగాణ నేత..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో తెలంగాణ నేతకు కీలక పదవి దక్కింది. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి ని నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అలాగే ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్‌ నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. నల్లు ఇంద్రసేనారెడ్డి తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, రఘుబర్‌ దాస్‌ ఝార్ఖండ్‌ మాజీ సీఎం అన్న సంగతి తెలిసిందే..

నల్లు ఇంద్రసేనారెడ్డి విషయానికి వస్తే..విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల మక్కువను పెంచుకున్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా నగర కార్యదర్శిగా ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా జైలుకు సైతం వెళ్లడం జరిగింది. జనతా పార్టీ రాష్ట్ర శాఖ యువ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, బిజెపి ఏర్పడిన తర్వాత యువమోర్చా తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా, యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నల్లు ఇంద్రాసేనారెడ్డి పనిచేశారు. బిజెపి రాష్ట్ర కోశాధికారిగా, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇంద్రసేనారెడ్డి 1983, 1985, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి 2009లో మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి, 2014లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఒడిశా గవర్నర్ గా నియమితులైన రఘుబర్‌దాస్‌ 2014 నుంచి 2019 వరకు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. జాతీయ స్థాయిలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా చేసిన అనుభవం ఆయన సొంతం.