గాజాకు 100 మిలియన్ డాలర్ల సాయం: అమెరికా అద్యక్షుడు జో బైడెన్

ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ అనంతరం సాయం ప్రకటన చేసిన బైడెన్

In Tel Aviv Biden announces $100m aid for Gaza, West Bank

వాషింగ్టన్‌ః ఇజ్రాయెల్ ప్రతిదాడితో గాజాలో తినడానికి తిండి, తాగడానికి నీరు లేని పరిస్థితి నెలకొంది. వెస్ట్ బ్యాంకులో నివసిస్తోన్న పాలస్తీనీయుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అద్యక్షుడు జో బైడెన్… గాజా, వెస్ట్ బ్యాంకుకు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో భేటీ అయిన బైడెన్ సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు.

ఇరువర్గాల మధ్య భీకర పోరు నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన పది లక్షల మందికి పైగా ప్రజలకు, యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన సాయం ఉపయోగపడుతుందని బైడెన్ అన్నారు. అయితే తమ సాయం హమాస్ లేదా ఇతర తీవ్రవాద సంస్థలకు కాకుండా ప్రజలకు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ఒంటరి కాదని, అమెరికా ఉన్నంత వరకు ఆ దేశానికి అండగా ఉంటామన్నారు. అయితే పాలస్తీనాలో మెజార్టీ ప్రజలకు హమాస్‌తో అసలు సంబంధం లేదన్నారు.