‘రిపబ్లిక్‌’ చిత్రాన్ని చూసి మెచ్చుకున్న కాంగ్రెస్ నేతలు

సాయి ధరమ్ తేజ్ – దేవాకట్టా కలయికలో తెరకెక్కిన ‘రిపబ్లిక్‌’ చిత్రానికి మంచి ఆదరణ దక్కితుంది. సినీ ప్రేక్షకులు , అభిమానులే కాదు రాజకీయ నేతలు సైతం సినిమా చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రతినిధి నారా లోకేష్ ‘రిపబ్లిక్’ బాగుందంటూ ట్వీట్ చేయగా..తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్, ములుగు ఎమ్మెల్యే సీతక్క చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు.

ఏఎంబి సినిమాస్‌లో ‘రిపబ్లిక్‌’ ప్రత్యేక స్క్రీనింగ్‌లో వీరు వీక్షించారు. రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరూ సినిమా చూసి చిత్ర బృందాన్ని ప్రశంసించారు. స్క్రీనింగ్‌లో డైరెక్టర్ దేవ కట్టా, గాయని స్మిత కూడా ఉన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. రాజకీయ నాయకులు ప్రజలను ఎలా వాడుకుంటున్నారు.. ఇలాంటి నిజాలను మనం ఒప్పుకోలేనంత పచ్చిగా చూపించాడు దేవా కట్ట. వీటి చుట్టూ అల్లుకున్న కథ రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లో చేసిన హానెస్ట్ అటెంప్ట్ ఇది. ఇందులో కొన్ని సన్నివేశాలు మనం రోజు పేపర్లో చదివేవి.. వార్తల్లో చూసేవి. నిజాయితీగా పని చేయాలి అనుకునే అధికారులకు.. వ్యవస్థలో ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో చూపించాడు దేవా కట్టా. ఈ క్రమంలో ఎవర్ని ఆయన ప్రతినాయకుడిగా చూపించలేదు. కేవలం వ్యవస్థలో ఉన్న పరిస్థితులు.. అక్కడ ఉన్న వ్యక్తులను మాత్రమే విలన్లుగా చూపించడం జరిగింది.