బచ్చుల అర్జునుడు మృతిపై చంద్రబాబు దిగ్బ్రాంతి

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి ఫై పార్టీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అర్జునుడు.. ఇటీవలే గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని చంద్రబాబు పేర్కొన్నారు. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించామని కానీ ఇలా జరగడం తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

అటు, యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు మృతి చెందిన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. నిజాయతీకి మారుపేరు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని లోకేశ్ కొనియాడారు. ఆయన కన్నుమూయడం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.